Wednesday, November 21, 2012

అడ్డు పడకు, అడ్డు పడకు















గంజి పెట్టిన ఖద్దరు చొక్కా, చాకలి చమటతో మురికిని ఉతకగా 
ఇస్త్రీ మడతతో జబర్దస్తీగా, పార్టీ జండాతో కారులో పోగా
జబ్బు పడ్డ ఓ చాకలోడా
అడ్డు పడకు, అడ్డు పడకు 



























చర్మం వలచి ఎండలో పరచి, కుళ్ళి కంపునే హయీగా పీల్చి 
పేక దారమే సూదికి చేర్చి కాలి వ్రేలితో ముడి బిగించి 
మూల పడ్డ కత్తికి పదునే చేర్చి, మూతపడ్డ దుకాణమే తెరచి
కుట్టిన చెప్పులు పాలిష్ మెరుపుతో, కార్పెట్ ఫై సాగి పోగా 
ముళ్ళ బాటఫై పరిగెత్తుకొచ్చిన, ఓ మాదిగోడ
అడ్డు పడకు, అడ్డు పడకు



ఎదిగిన బొచ్చే కత్తిరించిన, తెల్ల బొచ్చుకు రంగును పులిమిన
రోషం లేని బడా మేసాలనే, సంపంగి నూనె తో సాపు చేసిన
గడ్డం పెరిగిన ఓ మంగళోడా, టోపీ బాబులకు
అడ్డు పడకు, అడ్డు పడకు 
                                                           
                                                   















బంక మట్టికై చెరువుల కేగి, మండు టెండలో తట్టల కెత్తి
వంగిన నడుముతో కావిడ మోసి, మోకాలిలోతు బురదను చేసి 
అరికాళ్ళతోనే అడుసుని తొక్కి, బిగిసే వరకు పిసికి పిసికి 
చల్లని మనసుతో కుండలు చేసి,కాలే కడుపుతో కుండలు కాల్చి
అమ్ముదామని సంతకు వెళితే, గిరాకి లేదని బయటకు నెడితే
బొక్కలు విరిగిన ఓ కుమ్మరోడ
అడ్డు పడకు, అడ్డు పడకు 








చితికిన బ్రతుకులో ఆశను నింపి, చీకిన వలను మళ్లీ పేని
తాత ఆస్తి తాటి తెప్పతో, అయ్య ఇచ్చిన వెదురు తెడ్డుతో
వేటకు సాగిన ఓ చేపలోడ, రొయ్య మీసం నీకు చిక్కేనా 
చిక్కని చేపలు చక్కగా తిరిగే, చావు బ్రతుకులు నీకే వదిలే 
రోజూ చస్తూ బ్రతికే ఓ జాలరోడా
అడ్డు పడకు, అడ్డు పడకు































ఎండా వానా చలి అయినా, కొలిమి వేడికి సోమ్మసిల్లినా 
కాలే కత్తి చేత పట్టినా, బొబ్బలు కట్టి మంట పుట్టినా 
ఆకలి చేతులు సుత్తిని పట్టి, సాగే వరకు ఇనుమును కొట్టి
పలక బలపం ఊసే మరచి, పలుగు పార నువ్వు చేస్తే
చేతికి వచ్చే సోమ్మెంతా, కడుపు నిండని నీ బ్రతుకెంత
అయినా కోపం ఎరుగని ఓ కమ్మరోడా
అడ్డు పడకు, అడ్డు పడకు









పాలికాపుగా వాకిట నిలిచి, దూళ్ళ కాపుగా ఎండను ఏడ్చి
మురికి చెరువులో గేదలు కడిగి, చేల గట్టుపై గడ్డిని కోసి
పేడ పిడక శుబ్రం చేసి, తెల్లటి పాలను ఇంటికి చేర్చితే
అంటరాదనీ నిన్నాడవుంచినా, వాళ్ళు మాత్రమె పాలను త్రాగినా
మచ్చలేని ఓ హరిజనవాడ
అడ్డు పడకు, అడ్డు పడకు